ఉపోద్ఘాతం 1
లూకా సువార్తలో చూపింపబడే దృశ్యం - యేసు క్రీస్తు - ఆత్మపూర్ణుడైన నరుడు
యేసు మరియ గర్భములోనికి వచ్చినప్పటినుండి ఆయన పునరుత్థానము వరకు, ఆయన పునరుత్థానమైన తరువాత జరిగినవాటి గురించి కొంతమట్టుకు సాధ్యమైనంత రీతిగా ఖచ్చితమైన చరిత్రను ఇవ్వాలన్నది లూకా యొక్క భారముగా నున్నది (1:3).
క్రొత్త నిబంధనను వ్రాసిన వారిలో యూదుడుకానివాడు లూకా ఒక్కడే. అతడు లూకా సువార్తను మరియు అపొస్తలుల కార్యములను వ్రాసెను. క్రొత్త నిబంధనలో ఉన్న మిగతా 25 పుస్తకములు యూదులచేత వ్రాయబడినవి. (పాతనిబంధనలో యోబు గ్రంథము తప్ప మిగతా 38 గ్రంథములను ఇశ్రాయేలీయులు వ్రాసిరి). గ్రీసు దేశస్తుడైన లూకా ఈ రెండు గ్రంథములను థెయొఫిలా అనే మరొక గ్రీసు దేశస్తునికి వ్రాసెను. యేసు మనిషిగా భూమి మీదకు ఎలా వచ్చెనో ఆయన ఎలా జీవించి దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చెనో చూపించడానికి ఒక గ్రీసు దేశస్తుడు మరియొక గ్రీసు దేశస్తునికి వీటిని వ్రాశాడు.
లూకా సువార్తలో పరిశుద్ధాత్మయొక్క పరిచర్య యొక్క ప్రాముఖ్యత:
లూకా వ్రాసిన రెండు గ్రంథాలలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య గురించి ఎంతో వ్రాసెను. నిజానికి, ఇది అతని ప్రధాన అంశాలలో ఒకటైయున్నది. ఈ సువార్తలో ఉన్న ఈ ఉదాహరణలను చూడండి: బాప్తిస్మమిచ్చు యోహాను గర్భమునుండే పరిశుద్ధాత్మతో నింపబడును (1:15). మరియ మీద పరిశుద్ధాత్మ వచ్చును (1:35). ఎలీసబెతు మరియు జెకర్యాలు పరిశుద్ధాత్మతో నింపబడిరి (1:41,67). సుమెయోను మీదకు పరిశుద్ధాత్మ దిగిరాగా అతడు పరిశుద్ధాత్మనుండి ప్రత్యక్షతను పొంది ఆత్మచేత దేవాలయములోనికి నడిపింపబడెను (2:25-27).
యేసు పరిశుద్ధాత్మలో బాప్తీస్మమిచ్చును (3:16). యేసు బాప్తీస్మము పొందినప్పుడు ప్రార్థించుచుండెను (అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కొరకే). మరియు ఆత్మ ఆయన మీదకు వెంటనే వచ్చెను (3:21,22). యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి ఆత్మ బలముతో తిరిగి వచ్చెను (4:1,14). పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండెనని యేసు ప్రకటించెను (4:18). అడుగువారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును (11:13).
పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు కనిపెట్టమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించెను (24:29). అపొస్తలుల కార్యములలో, లూకా పరిశుద్ధాత్మను 50 సార్లుకంటే ఎక్కువ పేర్కొనెను. లూకా నిశ్చయముగా ఆత్మ నింపుదలగల వ్యక్తిఅయియుండెను మరియు పరిశుద్ధాత్మ అను వరము ద్వారా సాధ్యమయ్యే ఈ క్రొత్త నిబంధన జీవితమును బట్టి ఉత్సాహపడెను. అతనికున్న ఉత్సాహము ఎంత మంది క్రైస్తవులకున్నదా అని నేను ఆలోచిస్తాను.
క్రొత్త నిబంధన యొక్క మొదటి అయిదు గ్రంధముల యొక్క ఆరంభములో పరిశుద్ధాత్మయొక్క బాప్తీస్మము పేర్కొనబడినది. క్రొత్త నిబంధన యుగములో పరిశుద్ధాత్మయొక్క పరిచర్యకున్న గొప్ప ప్రాముఖ్యతను గూర్చి ఇది మనకు నేర్పిస్తుంది. గనుక అపవాది దేనినైనా నకిలీ చేయాలని చూస్తే అది పరిశుద్ధాత్మ బాప్తీస్మమునే చేస్తాడు. అటువంటి నకిలీలను ఎన్నిటినో మనము ఈ రోజున చూస్తున్నాము.
~ జాక్ పూనెన్ ~

0 కామెంట్‌లు