మలాకీ 1:1 - ప్రభువు యొద్ద నుండి ఒక భారాన్ని పొందుటకు కనిపెట్టుము

మలాకీ 1:1 ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు.


'మలాకీ' అనే మాటకు 'నా దూత' అని అర్థము. ఇతర ప్రవక్తల వలే మలాకీ కూడా ఒక భారమును కలిగియుండెను. ప్రతి ప్రవక్తకు దేవుని యొద్ద నుండి పొందిన ఒక ప్రత్యేకమైన భారముండెను. అయితే వారందరు దేవుని ప్రజలలో లేని పరిశుద్ధతను బట్టి చింతించిరి. దేవుడు నీ హృదయము మీద పెట్టిన భారము ఆయన నీ కొరకు యోచించిన పరిచర్యను సూచిస్తుంది. గనుక ఆయన యొద్ద నుండి ఒక భారాన్ని పొందుటకు ఆయన కొరకు కనిపెట్టుము.

ఒక భారము లేకుండా నీవు ప్రభువును సేవిస్తే కొంత కాలమైన తరువాత నీకు విసుగు పుట్టును. ఆ తరువాత నీవు డబ్బునో, మనుష్యులిచ్చే ఘనతనో లేక సుఖమునో కోరుకోవచ్చు. ఈ రోజున ప్రభువును సేవిస్తున్నామని చెప్పుకునే వారెందరికో తమ పరిచర్యపట్ల దేవుని నుండి పొందిన భారము లేకపోవడం దురదృష్టకరం.

దేవుడొక వ్యక్తికి పిల్లల మధ్య పనిచేయాలనే భారాన్ని ఇవ్వవచ్చును. మరొకరికి సువార్తీకరణ కొరకు భారాన్ని ఇవ్వవచ్చును. మరొకరికి దేవుని ప్రజలకు బోధించాలనే భారముండవచ్చును. క్రీస్తు శరీరములో వేర్వేరు సభ్యులకు దేవుడు వేర్వేరు భారములనిచ్చును. మనము ఇంకొకరి పరిచర్యను అనుకరించడానికి లేక అతని భారాన్ని కలిగియుండటానికి ప్రయత్నించకూడదు. నీకున్న భారాన్ని ఇతరులు కలిగియుండాలని వారిని బలవంతపెట్టకుము. వేరొకరు తన భారాన్ని నీకు ఇవ్వడానికి అనుమతించకుము.

దేవుడే నీకొక భారాన్ని ఇవ్వనిమ్ము - ఆయన నీ కొరకు తలపెట్టిన భారాన్ని ఇవ్వనిమ్ము. అనేకులు వారు చేసే పరిచర్య పట్ల నేను భారము కలిగియుండాలని నన్ను ప్రేరేపించిరి - అది సాధారణంగా సువార్తీకరణ. కాని నేను అటువంటి ఒత్తిళ్ళనకు ఎదిరించాను. దేవుడు వేరొకరికి ఇచ్చిన భారమును కలిగియుండాలన్న ఆసక్తి నాకు లేదు. దేవుడు నాకొక ప్రత్యేకమైన భారాన్ని ఇచ్చెను. గనుక ఆ పరిచర్యనే నేను నెరవేరుస్తానని తీర్మానించుకున్నాను. దేవుడు వారికిచ్చిన భారమునుండి పరిచర్యనుండి ప్రక్కదోవ పట్టించడానికి ప్రవక్తలు ఎవరిని అనుమతించలేదు.

నీకు ఎటువంటి భారము లేకపోతే నీవు దేవుని యొద్దకు వెళ్లి నీకొక భారాన్ని ఇవ్వమని అడగాలి. క్రీస్తు శరీరములో నెరవేర్చడానికి ఆయన నీ కొరకు ఒక ప్రత్యేకమైన పరిచర్యను కలిగియున్నాడు. అదేమిటో నీవు తెలుసుకోవాలి. అనేక మంది బోధకులు ఒక పరిచర్యనుండి మరొకదానికి తిరుగుతూ ఉంటారు. వారికి ఎక్కువ జీతము నిచ్చే క్రైస్తవ సంస్థలో చేరుతారు. 

ఉదాహరణకు, వారు రేడియో పరిచర్య పట్ల భారమున్నదని మొదలు పెట్టవచ్చును. కాని పిల్లల మధ్య సువార్త చెప్పే ఒక సంస్థ వారికి ఎక్కువ జీతాన్ని ఇస్తానంటే వారు ఉన్నట్లుండి పిల్లల మధ్య సువార్త పట్ల భారాన్ని కలిగియుంటారు. కొంతకాలము తరువాత ఒక క్రైస్తవ సాహిత్య సంస్థ వారికి ఇంకా ఎక్కువ జీతాన్ని ఇస్తానంటే, ఉన్నట్లుండి వారి భారము సాహిత్య పరిచర్య వైపుకు వెళ్తుంది. అటువంటి బోధకులు ప్రభువును సేవించడం లేదు. వారు బబులోను వ్యాపారములలో పాల్గొనుచున్న మతానుసారులు. దేవుడు నీకొక భారాన్ని ఇచ్చినప్పుడు ఏదో సంస్థ నీకు మెరుగైన జీతాన్ని ఇస్తుంది గనుక నీవు ఆ భారాన్ని విడిచిపెట్టలేవు.

~ జాక్ పూనెన్ ~

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు