ముగ్గురు తల్లులు నేర్పే పాఠాలు - బ్రదర్ ఇయన్ రాబ్సన్

ముగ్గురు తల్లులు నేర్పే పాఠాలు: దైవిక స్త్రీత్వానికి పిలుపు


తల్లి యొక్క నిశ్శబ్ద బలం

తల్లులు తరచుగా మనకు తెలిసిన అత్యంత నిస్వార్థపరులైన వ్యక్తులు. మనలో చాలామంది తమ భోజన బల్లల వద్ద ఈ నిస్వార్థతను చూసి ఉంటారు, అక్కడ ఒక తల్లి తన బిడ్డకు ఎక్కువ దక్కాలని తన వాటాను నిశ్శబ్దంగా వదులుకుంటుంది. అయినప్పటికీ, మనం దానిని గమనించకపోవచ్చు. అటువంటి ప్రేమ తరచుగా కనిపించదు, కొనియాడబడదు, కానీ అది చాలా లోతైనది. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా, వినయం, విశ్వాసం మరియు బలంతో నడిచి, వారి నిశ్శబ్ద విధేయత ద్వారా తన పిల్లలను, మరియు వారి తరాన్ని దేవుని కొరకై తీర్చిదిద్దిన దైవిక తల్లుల వారసత్వాన్ని మనం గుర్తుచేసుకోవడం సముచితం.

నేడు మనకు బోధించడానికి లేఖనాల్లో ముగ్గురు తల్లుల జీవితాలను పరిశీలిద్దాం. నేటి మహిళలకు - మీరు తల్లి అయినా, తల్లి కావాలని ఆశిస్తున్నా, లేదా మీ చుట్టూ ఉన్న యువ జీవితాలను ప్రభావితం చేస్తున్నా - మీలో ప్రతీ ఒక్కరికి ఈ ముగ్గురు స్త్రీలు  శక్తివంతమైన సందేశాన్ని అందిస్తారు.

1. మరియ: వినయం మరియు విధేయతకు ఆదర్శం


యేసు తల్లి అయిన మరియ, అసాధారణమైన వినయాన్ని ప్రదర్శించిన ఒక యువతి. దేవదూత గాబ్రియేలు ఆమెకు దేవుని కుమారుడిని కనబోతున్నానని చెప్పినప్పుడు, ఆమె స్పందన సాధారణమైనదే కానీ శక్తివంతమైనది: “ఇదిగో ప్రభువు దాసురాలు; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” (లూకా 1:38) ఈ ఒప్పుకోలు దేవుని చిత్తానికి ఆమె సంపూర్ణ విధేయతను ప్రతిబింబిస్తుంది. దేవుని నుండి వచ్చిన ఏ మాట కూడా ఎప్పటికీ విఫలం కాదని ఆమె నమ్మింది. మనము రోమన్ కాథలిక్ వారిలా మరియను ఆరాధించనప్పటికీ, మనము మరియ యొక్క విశ్వాసం మరియు వినయం ఖచ్చితంగా అభినందించదగినవి మరియు అనుసరించదగినవి. భూమిపై ఉన్న స్త్రీలందరిలో, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు - ఆమె వంశం, రూపం లేదా ప్రతిభ కారణంగా కాదు - ఆమె హృదయం కారణంగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు.

తరువాత, లూకా 1:46-55లో, మరియ యొక్క స్తుతి గీతం (తరచుగా మాగ్నిఫికాట్ అని పిలుస్తారు) ఆమె ఆధ్యాత్మిక లోతును మరింత వెల్లడిస్తుంది. ఆమె ప్రభువును ఘనపరుస్తుంది, తన రక్షకునిలో ఆనందిస్తుంది మరియు దేవుని దయ, న్యాయం మరియు విశ్వాస్యతను ప్రకటిస్తుంది. ఇది వినయస్తుల పట్ల దేవుని సముఖతను మరియు గర్విష్టులపై ఆయన విముకతను గురించి మాట్లాడే గొప్ప వాక్య భాగం.

కష్ట సమయాల్లో ఆమె స్పందించిన తీరులో కూడా మరియ యొక్క వినయం కనిపిస్తుంది. సిమియోను ఆమె స్వంత ఆత్మను ఒక ఖడ్గం చీల్చుకుపోతుందని ప్రవచించినప్పుడు (లూకా 2:34-35), ఆమె ఆ మాటలను నిశ్శబ్దంగా దాచుకుంది. ఆమె నిరసన వ్యక్తం చేయలేదు లేదా దేవుణ్ణి ప్రశ్నించలేదు - కానీ ఆమె దేవుని మార్గాన్ని అంగీకరించింది.

నేడు, దైవభక్తికి, విజయవంతమైన జీవితానికి మరియు మన కుటుంబాలకు మరియు సంఘానికి ఆశీర్వాదంగా ఉండటానికి వినయం ఒక రహస్యంగా ఉంది. ఒక స్త్రీ తనను తాను గుర్తించబడకుండా, వినయస్తురాలు అని  పిలువబడాలని కూడా కాకుండా, కేవలం దేవుణ్ణి సంతోషపెట్టడానికి తగ్గించుకున్నప్పుడు - అటువంటి హృదయం స్వర్గాన్ని తాకుతుంది. మరియలో కనిపించిన ఈ వినయం, క్రీస్తులో పరిపూర్ణమైనది (ఫిలిప్పీయులు 2). ఈ వినయం దేవునికి అత్యంత విలువైనది.

దేవాలయంలో యేసు బోధకుల మధ్య కనుగొనబడినప్పుడు కూడా, మరియ స్పందన ప్రతిస్పందించేదిగా, లేదా ప్రశ్నించేదిగా  లేదు. ఆమె వివరణలు కోరలేదు, కానీ నిశ్శబ్దంగా తన కొడుకు జీవితంలో దేవుని పనిని గురించి ఆలోచించింది. “ఆయన తల్లి ఈ మాటలన్నిటిని తన హృదయములో ఉంచుకొనెను.” (లూకా 2:51) మరియకు ఉన్న ఈ నిశ్శబ్దమైన బలం మనము అనుకరించదగినది.

ఈ మాటలు చదివే ప్రతి స్త్రీ అలాంటి తల్లిగా ఉండాలని, వినయంగా నడవాలని మరియు ప్రతి తరంలో క్రీస్తు సువాసనను వదిలి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.

లేఖన సూచనలు (వివరణలతో):

  • లూకా 1:38 - మరియ యొక్క వినయం మరియు విశ్వాసాన్ని చూపిస్తుంది.
  • లూకా 1:46-55 - మాగ్నిఫికాట్: లోతైన ఆధ్యాత్మిక సత్యాలతో నిండిన స్తుతి గీతం.
  • లూకా 2:34-35 - మరియకు సిమియోను ప్రవచనం: దేవుని చిత్తాన్ని అనుసరించడంలో ఉన్న ఖర్చు.
  • లూకా 2:51 - మరియ దేవుని కార్యాలను నిశ్శబ్దంగా దాచుకుంది, ఆమె ఆధ్యాత్మిక లోతును చూపుతుంది.
  • ఫిలిప్పీయులు 2:5-8 - క్రీస్తు వినయం: అనుసరించడానికి అంతిమ ఉదాహరణ.

2. లోయిస్ మరియు యునీకే: విశ్వాస వారసత్వాన్ని అందించడం


విశ్వాసం కేవలం మాటలతో బోధించేది కాదు - అది జీవితం ద్వారా నేర్పించబడుతుంది. 2 తిమోతి 1:5లో, తిమోతిలో ఉన్న నిజమైన విశ్వాసాన్ని పౌలు గుర్తించడం మనం చూస్తాము, అది మొదట అతని అమ్మమ్మ లోయిస్‌లోనూ తరువాత అతని తల్లి యునీకేలోనూ ఉంది. ఈ ఇద్దరు స్త్రీలు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రకాశవంతమైన ఉదాహరణలుగా నిలుస్తారు.

అమ్మమ్మలారా, నానమ్మలారా, మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు ఇప్పటికీ ఈ విశ్వాసపు విత్తనాలు నాటవచ్చు - ముఖ్యంగా ఇప్పుడు తమ పిల్లలను పెంచుతున్న మీ కుమార్తెల్లో. లోయిస్ భూమిని లేదా సంపదను తన కుమార్తెకు వారసత్వంగా విడిచిపెట్టలేదు, కానీ చాలా కాలం నిలిచే  సజీవమైన  విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చింది. ఆమె కుమార్తె యునీకే ఆ విశ్వాసాన్ని గ్రహించి, దానిని తన కుమారుడు తిమోతికి అందించింది.

యునీకే భర్త ధనవంతుడైన గ్రీకు వ్యక్తి కావచ్చు, కానీ యునీకే తన కుమారుడిని ఆ లోకంవైపు కాకుండగా దేవునిపైపు నడిపించగలిగింది. తిమోతి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆమె చేసిన పెట్టుబడి ఫలించింది. తిమోతి ఒక యువ అపొస్తలుడయ్యాడు - తొలి సంఘంలో దేవుడు శక్తివంతంగా ఉపయోగించిన పాత్రగా తయారుచేయబడ్డాడు. అదంతా తల్లి మరియు అమ్మమ్మ నుండి వచ్చిన విశ్వాసంతో ప్రారంభమైంది.

పౌలు 2 తిమోతి 1:6-7లో తిమోతికి దేవుని వరం మంటలా ప్రజ్వరిల్లజేయమని ప్రోత్సహించాడు: “దేవుడు మనకు పిరికితనం యొక్క ఆత్మను ఇవ్వలేదు, కాని శక్తి, ప్రేమ మరియు ఆత్మనిగ్రహం యొక్క ఆత్మను ఇచ్చాడు.”

తల్లులారా, దీనిని ఒక సవాలుగా తీసుకోండి. మీ ఇంటిని నిర్వహించడం, ఇంటి బాగోగులు మాత్రమే  చూసుకుంటే  సరిపోదు - మీ పిల్లలకు విశ్వాసాన్ని ఇవ్వండి. మనము  ఎన్నడూ ఎదుర్కోని ఎక్కువ శోధనలు, ఎక్కువ ఒత్తిడి మరియు ఎక్కువ ఆధ్యాత్మిక వ్యతిరేకత ఉన్న ప్రపంచంలో మీ పిల్లలు పెరుగుతున్నారు. కానీ మీరు మీ పిల్లలకు భయం కాదు ధైర్యాన్ని; సందేహం కాదు విశ్వాసాన్ని; రాజీ కాదు ఆత్మనిగ్రహాన్ని వారి జీవితములో నాటండి. ఇది గొప్ప బాధ్యత మరియు గొప్ప అవకాశం.

మీ భర్త దూరంగా ఉన్నా లేదా పనిలో ఉన్నా, మీ పిల్లలను దేవుని భయంతో పెంచడం, వారిని పరిశుద్ధాత్మతో నింపబడమని ప్రోత్సహించడం మరియు ఈ లోకం నుండి భిన్నంగా జీవించమని వారిని హెచ్చరించడం వంటి ఈ శక్తివంతమైన అవకాశం మీకు ఉంది. "దేవుడు వారికి భయము యొక్క ఆత్మను ఇవ్వలేదు" అని మీ పిల్లలకు గుర్తు చేయండి .

ప్రతి తల్లి మరియు అమ్మమ్మ ఈ పిలుపును తీవ్రంగా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. బోధించండి, ఆదర్శంగా ఉండండి మరియు ప్రార్థించండి. కేవలం నైతిక విలువలను మాత్రమే కాకుండా, సజీవమైన, శక్తివంతమైన విశ్వాసాన్ని మీ పిల్లలకు ఇవ్వండి.

లేఖన సూచనలు (వివరణలతో):

  • 2 తిమోతి 1:5 - లోయిస్ నుండి యునీకేకు మరియు తరువాత తిమోతికి విశ్వాసం అందించబడింది.
  • 2 తిమోతి 1:6-7 - యువకులు పిరికివారుగా కాకుండా ధైర్యవంతులుగా ఉండాలని దేవుడు పిలుస్తాడు; శక్తి, ప్రేమ మరియు ఆత్మనిగ్రహంతో నిండి ఉండాలి.

ఒక తల్లి మాత్రమే: ఒక చక్కటి కవిత   

(ఇక్కడ రచయిత ఇంట్లో ఉన్న ఫ్రేమ్ లో  ఒక హృదయపూర్వక కవిత ఉంది, ఇది అతని భార్యకు ఆమె తల్లి బహుమతిగా ఇచ్చింది. ఈ కవిత నిజంగా మాతృత్వం అంటే ఏమిటో తెలియజేస్తుంది)

ఒక తల్లి మాత్రమే


ఇంటిని కలిసిమెలిసి ఉంచడానికి ఎంత శ్రమ పడాలో,
ఎన్నెన్నో బాధ్యతలు భుజాలపై వేసుకోవాలో,
అన్ని అడుగులు ఎంతో జాగ్రత్తగా వేయాలో –
వీటన్నిటిని ఎవరూ గుర్తించరు… తల్లి తప్ప.

పిల్లల చిన్న చిన్న బాధలను శ్రద్ధగా వినే వారు ఎవరూ లేరు,
కానీ తల్లి మాత్రం ముద్దులతో ఆ దుఃఖాన్ని తుడిచేస్తుంది.
పిల్లల చెడుతనాన్ని చూసి బాధపడేది కూడా…
ఇతరులెవరూ కాదు – తల్లి మాత్రమే.

పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన,
వారి జీవితంలో తుపాన్ల మధ్య వారు తట్టుకుని నిలబడగలరా అనే భయం –
ఇలాంటి గాఢమైన ఆలోచనలు తల్లినే వెంటాడతాయి;
ఇవన్నీ ఎవరూ ఊహించలేరు… తల్లి తప్ప.

ఆ పరలోకపు సింహాసనం ఎదుట మోకాళ్లపై కూర్చుని,
దైవానికి తల్లి ప్రేమ అనే అమూల్యమైన వరం కోసం కృతజ్ఞతలు చెప్పే వారు ఎవ్వరూ లేరు,
ఇంతదాకా అందించిన ప్రేమకు సరైన రీతిలో కృతజ్ఞతలు చెప్పగలిగేది… తల్లి మాత్రమే.



తల్లులు ఈ ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తులు

తల్లులు ఇంటికి మరియు సంఘానికి కనిపించని వెన్నెముక. వారు వేదికల వెనుక నిలబడకపోవచ్చు, ప్రసంగాలు చెయ్యకపోవచ్చు, కానీ వారి ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. వారు వంటగదిలో, మంచం పక్కన, పాఠశాల గేటు వద్ద - ప్రతిరోజూ క్రీస్తు ప్రేమను, సహనాన్ని మరియు వినయాన్ని ఆదర్శంగా చూపిస్తారు.

ఈ మాతృ దినోత్సవం సందర్భంగా, ప్రతి తల్లి పరిశుద్ధాత్మతో తిరిగి నింపబడాలని కోరుకుంటున్నాను. పిరికితనం, భయం మరియు అవిశ్వాసం తొలగించబడాలి. మరియు వారు తమ పిల్లలకు శక్తి, ప్రేమ మరియు ఆత్మనిగ్రహం కలిగిన అదే ఆత్మను ఇవ్వాలి.

మీ పిల్లలు పెరిగి ఇల్లు విడిచి వెళ్ళినా, మీ పాత్ర ముగియలేదు. ప్రార్థించడం కొనసాగించండి, జీవపు మాటలు మాట్లాడండి మరియు నిశ్శబ్దమైన బలం మరియు దేవునిపై నమ్మకం యొక్క ఉదాహరణను చూపండి.

దేవుడు యేసును ఎంతగా ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. మీ త్యాగాలను, మీ కన్నీళ్లను, మీ దాగి ఉన్న శ్రమను ఆయన చూస్తాడు. మీరు ఇంటికి మరియు సంఘానికి జీవనాధారం.

ముగింపు ప్రార్థన ఆలోచన

పరలోకపు తండ్రీ, ప్రతి తల్లికి నీకు వందనాలు. వారికి నీ కృప, బలం మరియు విశ్వాసం అనుగ్రహించు. నీ పరిశుద్ధాత్మతో వారిని నింపు, తద్వారా వారు నీ మార్గాల్లో నడిచే మరియు ఈ తరంలో బలంగా నిలబడే పిల్లలను పెంచగలరు. వారు తమ ఇళ్లలో వెలుగుగా ఉండాలి మరియు దైవభక్తి యొక్క శాశ్వతమైన వారసత్వాన్ని విడిచిపెట్టాలి. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు