మీరు దుఃఖంలో ఉన్నారా? || సురేష్ వంగూరి

మత్తయి 14వ అధ్యాయం పలుభావోద్వేగాల సందర్భాల్ని వివరిస్తోంది. 

1. హేరోదు ఆజ్ఞ మేరకు సైనికులు బాప్తిసకుడు యోహానుని చంపేసారు. చాలా క్రూరంగా, కిరాతకంగా యోహాను తల నరికేసారు. 

ఆ వార్త వినగానే, యేసు ఒంటరిగా పడవలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు. తన బంధువూ స్నేహితుడూ యోహాను మరణం ఆయన హృదయాన్ని బ్రద్దలు చేసింది. 

యేసుక్రీస్తు, యోహానుల అనుబంధం బంధుత్వం కంటే మించింది. అది దైవికమైన అనుబంధం. దేవుని ప్రణాళికకు సంబంధించింది. తమ పనులూ పరిచర్యలూ లక్ష్యాలూ పరస్పరం ముడిపడిఉన్నాయి. యేసు రాకను చాటింపు వేసిన స్వరం అతను. యేసుని చూపిస్తూ ఈయనే మెస్సియా, లోకపాపాలు మోసికొనిపోయే దేవుని గొర్రెపిల్ల అని లోకానికి ఎలుగెత్తి చాటిన ప్రవక్త అతను. నీతిగా నిష్టగా జీవించినవాడు. 'పశ్చాత్తాపపడండి' అంటూ పిలుపునిచ్చినవాడు. నిర్మొహమాటంగా నిర్భయంగా అవినీతిని ఖండించినవాడు. సత్యం కోసం తన ప్రాణాలు అర్పించాడు. 

2. యోహాను మరణవార్త వినగానే యేసు ఎటువంటి ప్రతిస్పందనా చూపలేదు. ఏ వ్యాఖ్యా చేయలేదు. తట్టుకోలేకపోయాడు. దుఃఖం దహించేస్తుంటే, అక్కడనుండి మౌనంగా వెళ్ళిపోయాడు.  

దుఃఖం. దుఃఖం. హృదయవిదారక దుఃఖం. ఈ లోకపు తీరుకి దుఃఖం. సత్యం చెబితే చంపేసే లోకం ఇది. న్యాయం గురించి మాట్లాడితే నరికేసే సమాజం ఇది. నేడు యోహాను. రేపు తను. 

యేసు ఒంటరిగా ఏకాంతంగా ఉండిపోయాడు. బిగ్గరగా ఎక్కెక్కి ఏడ్చాడో... 'తండ్రీ' అంటూ గుండెలు పగిలేలా ప్రార్ధించాడో... హేరోదు అక్రమాలపై కోపాన్ని ఉగ్గబట్టుకుని మౌనంగా ఉండిపోయాడో...       

యేసుని వెతుక్కుంటూ జనాలు వచ్చేసారు. యోహాను గురించో హేరోదు గురించో ఏం వ్యాఖ్యలు చేస్తాడో విందామని వచ్చారో. ఏమన్నా అద్భుతాలు చేస్తాడని చూద్దామని వచ్చారో. ఏం బోధిస్తాడో విందామని వచ్చారో. 

ఆయన అంత దుఃఖంలో ఉండి కూడా, వాళ్లందరినీ చూడగానే హృదయం కరుణతో నిండిపోయింది. వారిపై జాలిపడ్డాడు. కనికరంతో రోగుల్ని స్వస్థపరిచాడు. అందరికీ ఆహారం పెట్టి ఆకలి తీర్చాడు. 

3. ఇది చాలా ఆశ్చర్యం. ఒకవైపు ఆయన దుఃఖిస్తున్నాడు. ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరోవైపు ప్రజలు తన వెంటపడుతున్నారు. ఆయన విసుక్కోలేదు. చిరాకుపడలేదు. కాసేపు నన్నొదిలేయండి అంటూ కసురుకోలేదు. తమ బాధలు చెప్పుకోవడానికి తనదగ్గరకు వచ్చినవాళ్లని ఆయన వెనక్కి పంపడు. ఆయన తన ప్రేమను pause లో పెట్టడు. అది ఆయన స్వభావం కాదు. తన దుఃఖాన్ని మోస్తూనే, వాళ్ళ బాధల్ని పట్టించుకుంటాడు. దటీజ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్! 

ఆయన దుఃఖం నిజం. దుఃఖం ఎంత బరువుంటుందో ఆయనకు తెలుసు. దుఃఖాన్ని లోపల్లోపలే మోసుకు తిరగటం ఆయనకు తెలుసు. ఇతరుల దుఃఖాన్ని తేలిక చేయటమూ తెలుసు. 

4. మనసు బాగలేకపోయినా ప్రేమించవచ్చా? దుఖంలోనూ ప్రేమను చూపొచ్చా? అవును అని ఆయన జీవితం చెబుతోంది. ప్రేమ పరిపూర్ణ భావోద్వేగ పరిస్థితుల కోసం వేచి ఉండదని ఆయన పనులు రుజువు చేస్తున్నాయి. 


మీరు దుఃఖంలో ఉన్నారా? ఈ రెండు పనులు మీరు చేస్తే చాలా బావుంటుంది. 

1. మీ దుఃఖాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రభువు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. 

2. మీ దుఃఖాన్ని మోస్తూనే, ఇంకెవరినైనా ఓదార్చాల్సి వస్తే, సంకోచించకండి. ప్రభువు మనకు నేర్పే ఉన్నతమైన జీవనప్రమాణం అది. 

(సురేష్ వంగూరి, 11-04-2025)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు