దృశ్యం 1
ఒక అపరిచితుడు (పేరు ఆనంద్ అనుకోండి) తలుపు తట్టకుండా, కాలింగ్ బెల్ నొక్కకుండా నేరుగా ఇంట్లోకి వచ్చేసాడనుకుందాం. అప్పుడు అమ్మ వంటగదిలో పని చేస్తూ ఉంది. అతడు వంటగదిలోకి వచ్చేసాడు. 'ఏంటీ వంట చేస్తున్నారా? ఏం కూర?' అని అమ్మను అడిగాడు. అప్పుడెలా వుంటుంది? అనూహ్యమైన ఈ పరిస్థితికి అమ్మకు చిర్రెత్తుకు రాదూ.
'ఎవడ్రా నువ్వు? ఏకంగా ఇంట్లోకి వచ్చి కూరేంటని అడుగుతున్నావ్, మర్యాదగా ముందు బైటకి నడువ్, లేదా పోలీసుల్ని పిలుస్తా' అంటూ కేకలేస్తుంది.
దృశ్యం 2
అదే అపరిచితుడు తలుపు తట్టకుండా, కాలింగ్ బెల్ నొక్కకుండా మరొక వ్యక్తితో మాట్లాడుతూ, నేరుగా వంటగదిలోకి వచ్చాడు. ఆ వ్యక్తి, అపరిచితుడ్ని చూపిస్తూ అమ్మతో ఇలా అన్నాడు... 'అమ్మా, ఇతను ఆనంద్ అని నా స్నేహితుడు. ఈ రోజు ఇతను కూడా ఇక్కడే భోంచేస్తాడు.' అప్పుడు అమ్మ చిరునవ్వుతూ అంటుంది, 'కూర్చో, ఆనంద్, మొదటిసారి మా ఇంటికి వచ్చావు. నువ్వు భోంచేయకుండా వెళ్ళడానికి వీల్లేదు.'
ఆ తల్లి, ఆనంద్ ని తన కొడుకుతో సమానంగా చూసింది, ఎందుకని? ఎందుకంటే, అతడు తన కొడుకు స్నేహితుడు కాబట్టి! కొడుకుని బట్టే అపరిచితుడికి ఆ ఇంట్లో స్థానం!
దేవుడు మనల్ని శత్రువులుగా, అపరిచితుల్లా, పరాయివారిగా చూడటం లేదు. దేవుడు మనల్ని తన బిడ్డల్లా, స్నేహితుల్లా చూస్తున్నాడు. అందుకు కారణం తన కుమారుడైన యేసుక్రీస్తూ, సిలువలో ఆయన చేసిన కార్యమూ!!
~ సురేష్ వంగూరి, (3 జనవరి, 2015)

0 కామెంట్‌లు